27-09-2025 08:53:11 PM
ప్రజాసమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యేతో కలసి పనిచేస్తూ నీలం మధు ముదిరాజ్
చిట్కుల్ లో ముంపు కాలనీల పరిశీలన
పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో వరదనీటితో ముంపుకు గురవుతున్న పలు కాలనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం చిట్కుల్ లోని ముంపు కాలనీలలో పర్యటించి ముంపు సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గత మూడేండ్లుగా వరద ముంపుకు గురవుతూ వర్ష కాలం వస్తుందంటే తీవ్ర భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాలనీవాసుల సమస్య విన్న నీలం మధు త్వరలో యుద్ధ ప్రతిపాదికన సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇప్పటికె పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముంపు కాలనీలలో పర్యటించి వరదనీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వరదనీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇప్పటికే కాలువ పనులకు సంబంధించిన అంచనా పూర్తయిందని త్వరలోనే పనులు మొదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తుందని, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఈ కాలనీల వరద సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు, ప్రజా సమస్యలకు సంబంధించి తన సంపూర్ణ సహకారం ఉంటుందని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీవాసులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.