07-09-2025 02:56:11 PM
సాటి గీత కార్మికున్ని కాపాడిన గౌడన్నలు
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): ఆపద సమయంలో ఆదుకున్నవారే నిజమైన దేవుడు అనే మాటను నిజం చేసి చూపించారు జనగాం కు చెందిన గౌడన్నలు. పక్కన వాళ్ళు ఎటు పోతే మనకు ఎందుకులే అనే స్వార్థం ఉన్న ఈ రోజుల్లో సాటి గీత కార్మికుని(Geeta worker) ప్రాణం కాపాడి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు.సంస్థాన్ నారాయణపూర్ మండలం జనగాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండూర్ చంద్రయ్యకు కల్లు గీసి అమ్మడమే జీవనాధారం.రోజు మాదిరిగానే కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి జారి తలకిందులుగా వేలాడాతూ రక్షించమని కేకలు వేశాడు.కేకలు విన్న తోటి గీత కార్మికులు యాదయ్య, ఇస్తారి, కిష్టయ్యలు ప్రాణాలకు తెగించి చంద్రయ్యను కాపాడారు.ఒక్కొక్కరుగా చెట్టుపైకి ఎక్కి చంద్రయ్యాను జాగ్రత్తగా కిందికి దింపి ధైర్యం చెప్పారు.అది చూసిన గ్రామస్తులు ముగ్గురిని అభినందించారు.