12-01-2026 03:11:22 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంటుందని, ఎవరు కొట్టినా వింటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌లోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్ల పథకాలను సోమవారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, దామోదర రాజనర్సింహ, సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... దివ్యాంగులకు మానవీయకోణంలో సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
రూ, 50 కోట్లతో దివ్యాంగులకు పరికరాలు అందించామని తెలిపారు. ప్రభుత్వం మీకోసం ఉందని చెప్పడానికే ఈ కార్యక్రమం అన్నారు. దివ్యాంగులను దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేస్తామని సీఎం ప్రకటించారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగుకుల సముచిత స్థానం ఇస్తామన్నారు. క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుని దివ్యాంగులు ఎదగాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో దివ్యాంగులకు స్ఫూర్తి జైపాల్ రెడ్డి అన్నారు.
ట్రాన్స్ జెండర్స్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్(Transgender)ని నామినేట్ చేయాలన్నారు. ట్రాన్స్ జెండర్ సమస్యలను వాళ్లే చెప్పుకునే అవకాశం ఇవ్వాలన్నారు. ప్రణామ్ కార్యక్రమంలో వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో(Telangana Assembly Session) బిల్లు తీసుకొస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిని మనమే దారిలోకి తీసుకురావాలన్నారు. తల్లిదండ్రులపై బాధ్యత లేనివారికి సమాజంపై ఏం బాధ్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిఒక్కరికీ వైద్యం అందించాలనేదే ఈ ప్రభుత్వం లక్ష్యమని సీఎం తెలిపారు. తెలంగాణ సమాజం స్వేచ్ఛ, సమాజిక న్యాయం, సమాన అవకాశాన్ని కోరుకుటుందని చెప్పారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కులాల జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలన్నారు. తమ ఒత్తిడితోనే కేంద్రం కులగణన చేస్తోందని సీఎం పేర్కొన్నారు.