calender_icon.png 13 September, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ దేశాల్లో ఏదైన గొప్పగా ఉందంటే ఇంజనీర్లు చేసిందే : సీఎం రేవంత్ రెడ్డి

13-07-2024 05:36:49 PM

హైదరాబాద్: జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిని వెలిగించి నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏఐ గ్లోబల్ సమ్మిట్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జేఎన్టీయూ పరిధిలో కళాశాలలు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం విధానం తెలవాలని, లక్ష మంది ఇంజనీరింగ్ పట్టాలు పొందిన వారికి ప్రభుత్వ విధానం తెలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ విధానాలు అందరికి తెలిసే విధంగా ప్రస్తుత కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం కీలకం. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం ప్రవేశపెట్టిందన్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు లేకుండా చేస్తామన్నారు. 

ప్రపంచ దేశాల్లో ఏదైన గొప్పగా ఉందంటే అది ఇంజనీర్లు చేసిందే అన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలకు సహయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కళాశాలలు ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం సివిల్ ఇంజనీర్ల కొరత చాలా ఉంది. కానీ కొన్ని కాలేజీలు సివిల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఎత్తేసే పనిలో ఉన్నాయని, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్లను తప్పనిసరిగా తయారు చేయండని కాలేజీ యాజమాన్యాలకు సీఎం సూచించారు.

లేదంటే భవిష్యత్తులో దేశం ఇబ్బందులకు గురవుతుందని ఆయన తెలిపారు.  రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. త్వరలోనే స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని పెడుతామని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.