calender_icon.png 23 December, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా చేస్తారా.. కాదనలేము

23-12-2025 01:51:27 PM

రహదారి ఆక్రమించి ఇంటి నిర్మాణం

చోధ్యం చూస్తున్న పురపాలిక శాఖ

అచ్చంపేట: ఇంటి పన్ను వసూళు మొదలు.. ఇంటి నిర్మాణం వరకు.. ప్రతీ విషయంలోనూ పేదల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే మున్సిపల్ అధికారులు.. పెద్దల విషయంలో మాత్రం తమకేమి పట్టనట్లు.. చోధ్యం చుస్తున్నారు. ఎవరైన ఫిర్యాదు చేస్తే ‘మాముళు’గానే చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే పట్టణంలో యధేశ్చగా రోడ్డు ఆక్రమణలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక 20 వార్డుల పరిధిలో విస్తరించి ఉంది. గతంతో పోలిస్తే కొత్త ఇళ్ల నిర్మాణాలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో కొంత మంది వ్యక్తులు విలువైన ప్రభుత్వ స్థలాలు, రహదారులు కబ్జా చేస్తున్నా.. మున్సిపల్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే విధంగా వ్యవహరిస్తూ.. తమదైన ముద్రను వేసుకుంటున్నారు.

రహదారి ఆక్రమణ.. అయినా పట్టింపులేదు

పట్టణంలోని పాతబజార్ నుంచి ఈద్గా సమీపంలో నుంచి 33 పీట్ల అంతర్గత రహదారి ఉంది. ఉట్లకోనేరు నుంచి లింగాల ప్రధాన రహదారిని అనుసందానం చేస్తూ ఈ రోడ్డు ఉంటుంది. ఉట్లకోనేరు సమీపంలోనే ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. ఆయన అంతర్గత రహదారిని ఆక్రమించి మరీ ఇంటిని నిర్మిస్తున్నాడు. నిత్యం రద్దీగా ఉండే రహదారిని కబ్జా చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు కబ్జా చేస్తుంటే రహదారి మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణం బాహాటంగానే కొనసాగుతున్నా.. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ లోపకారి ఒప్పందానికి మతబులేమిటో వారికి తెలవాలి. 

వాల్టా చట్టానికి తూట్లు... 20 ఫీట్లలోపు మూడు బోర్లు డ్రిల్లింగ్ 

అంతర్గత ప్రధాన రహదారిని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్న వ్యక్తి ఆ స్థలంలోనే నిబంధనలకు విరుద్ధంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ దాదాపు 20 ఫీట్ల పరిధిలోనే మూడు బోర్లను డ్రిల్లింగ్ చేశాడు. బోర్ డ్రిల్లింగ్ కోసం సంబంధిత రెవిన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోలేదు. ఒకవేళ అనుమతి తీసుకున్న ఒక్క బోరు మాత్రమే డ్రిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చట్ట విరుద్ధంగా మూడు బోర్లు డ్రిల్లింగ్ చేసి రెండిటిపై మట్టిని కప్పి  ఒక బోరు మాత్రమే డ్రిల్ చేశానని నలుగురికి తెలిసే విధంగా డ్రామాకు తెర లేపేడని కాలనీవాసులు వాపోతున్నారు. దీని వలన చుట్టుపక్కల ఉన్న బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయి విచారణ చేసి వాల్టా చట్టానికి విరుద్ధంగా బోర్లు వేసిన ఇంటి యజమానిపై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

రహదారి ఆక్రమణ నిజమే: టీపీవో

అచ్చంపేటలోని ఉట్లకోనేరు వద్ద ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తి రోడ్డు ఆక్రమించింది వాస్తవమేనని పట్టణ ప్రణాళిక అధికారిణి మనోజ తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పనులను పరిశీలించానని చెప్పారు. రోడ్డు ఆక్రమించడం వలన పనులు నిలిపివేయించామని తెలిపారు. నిబంధనల మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు.