calender_icon.png 23 September, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం టార్గెట్.. వంద రోజుల్లోనే మేడారం అభివృద్ధి

23-09-2025 02:59:48 PM

రామప్ప ఆలయం స్ఫూర్తిగా మేడారంలో రాతి కట్టడాలు

గతంలో అభివృద్ధి గురించి నేతలు అడగటమే గగనం

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ములుగు జిల్లా మేడారంలో(Medaram) పర్యటిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలను సీఎం, మంత్రులు దర్శించుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... గతంలో అభివృద్ధి గురించి నేతలను అడగటమే గగన మైన పరిస్థితి, అభివృద్ధి నిధులు అడిగితే ఏదో భిక్షం ఇస్తున్నట్లు వ్యవహరించేవారిని ఆరోపించారు. అభివృద్ధి అంటే.. అద్దాల మేడలు, గోడలు మాత్రమే కాదన్నారు. గిరిజనుల జీవన స్థితి మెరుగుపరచడమే అసలైన అభివృద్ధి అన్నారు. గిరిజనులకు 4.20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని చెప్పారు. గిరిజనులకు దశాబ్దాల పాటు అన్యాయం జరిగిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని భావించామని తెలిపారు. ప్రభుత్వ పాలనలో గిరిజనులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.

సమ్మక్క-సారలమ్మ గద్దెల పునః నిర్మాణం అవకాశం దక్కడం నా అదృష్టమని సీఎం పేర్కొన్నారు. నిధుల కోసం గతంలో సీతక్క(Minister Seethakka) ఇచ్చిన వినతిపత్రాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు సీతక్క నిధులు ఇవ్వటం కాదు.. నిధుల దస్త్రాలపై ఆమె సంతకం పెడుతోందన్నారు. రాతి కట్టడాలు వందల ఏళ్లు నిలబడి ఉంటాయన్న రేవంత్ రెడ్డి రామప్ప ఆలయం(Ramappa Temple) స్ఫూర్తిగా మేడారంలో కూడా రాతి కట్టడాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాతి కట్టటమైతేనే సమ్మక్క- సారలమ్మల కీర్తి మరో వెయ్యేళ్లు కూడా కనిపిస్తోందన్నారు. మాల వేసుకున్నంత అకుంఠిత దీక్ష వందరోజుల్లోనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుంభమేళాకు వేల కోట్లు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఎందుకు ఇవ్వట్లేదు? అని సీఎం ప్రశ్నించారు.