calender_icon.png 23 September, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తాం

23-09-2025 04:16:42 PM

రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అన్ని హామీలను అమలు చేస్తామని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి జి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. గత పది సంవత్సర బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు కొత్తగా 17 లక్షలు రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డ్ లబ్ధిదారులకు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 

కేసీఆర్ తీసుకున్న అనాలోచి త నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ అరెస్ట్ లతో కేసీఆర్ రాచరిక పాలన సాగించారని, పథకాల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నూతన గనులు రావాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాక్ ల వేలంపాటలో పాల్గొనాలని నిర్ణయించడం జరిగిందని, దీంతో నూతన గనులు రావడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు లేక రోడ్లు డ్రైనేజీలు అద్వానంగా ఉండేవని తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత 50 కోట్లను మంజూరు చేసి అభివృద్ధి పనులు వేగవంతం చేశానని స్పష్టం చేశారు. అమృత్ స్కీం ద్వారా పట్టణంలో ఇంటింటికి శాశ్వత మంచినీరు పథకం కల్పించడం జరుగుతుందన్నారు. పట్టణంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్, పైడిమల్ల నర్సింగ్, మంద తిరుమల్ రెడ్డి, మండల కాంగ్రెస్ ఇంచార్జ్ కడారి జీవన్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ నీలయ్య, మాజీ సర్పంచ్ ఒడ్నాల కొమురయ్య , మాసు సంతోష్ కుమార్, ఆకుల అంజి లు పాల్గొన్నారు.