calender_icon.png 23 September, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులలో అలసత్వం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి..

23-09-2025 03:46:25 PM

అందుబాటులో లేని మందులు, ఇంజక్షన్స్, సిబ్బంది..

తక్షణమే 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేయాలి..

డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల మహేష్..

మునుగోడు (విజయక్రాంతి): విధులలో అలసత్వం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి మాట్లాడారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా, సమస్యల వలయముతో ఉన్నదని ఆరోపించారు. నియోజకవర్గ కేంద్రంగా చెప్పుకోవడానికి మాత్రమే మునుగోడు వినిపిస్తుందని, కనీసం మండలంలో ఉన్నటువంటి పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి సరైనటువంటి ఆసుపత్రి లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అన్నారు. ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వివిధ చికిత్సల కోసం సుమారు 150 నుంచి 200 మంది వరకు నిత్యం వస్తూ ఉంటారని, కనీసం వారు త్రాగడానికి త్రాగునీటి సౌకర్యం అలాగే మూత్రశాలలు లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటే ఇంజక్షన్స్ అందుబాటులో లేకపోవడం, ఇద్దరు డాక్టర్స్ ఉంటే ఒకరు మాత్రమే విధుల్లో ఉండి మరొకరు విధుల్లో లేకపోవడం, హోమియోపతి డాక్టర్ సైతం విధుల్లో లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది బాధ్యతరహితంగా ఉండటం వంటి సమస్యలు మా దృష్టికి నేరుగా వచ్చాయని తెలియజేశారు. నిత్యం మునుగోడులో ఉండేటటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికలలో మునుగోడులో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క ప్రజా ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల మమకారం ఉంటే ఎన్నో సంవత్సరాలుగా వైద్యానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మునుగోడు ప్రజలను మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి, మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు యాట శ్రీకాంత్, పగిళ్ల యాదయ్య, మండల నాయకులు బొందు శివ, కుక్కల మహేష్ ఉన్నారు.