23-05-2025 03:04:37 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటిస్తున్నారు. పస్తాపూర్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా అన్నారు. మెదక్ ప్రజలను కాంగ్రెస్ ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని సీఎం తెలిపారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్ గా జహీరాబాద్ కావాలని కృషి చేశామని వెల్లడించారు. జహీరాబాద్ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచామన్నారు.
జహీరాబాద్ నిమ్జ్ లో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నిమ్జ్ లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. జహీరాబాద్ కు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత అందరినీ కలుపుకొని ముందుకెళ్తామన్నారు. నారాయణఖేడ్ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ మెదక్ లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని సూచించారు. సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కింద తీర్చిదిద్దుతామని తెలిపారు. సింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు అప్పు బాధ నుంచి తప్పించామని గుర్తుచేశారు. రైతుభరోసా పథకాన్ని అందుబాటులోకి తెచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు.
గతంలో వరి వేస్తే ఉరే అని చెప్పేవారు.. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికెళ్లినా ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం రూ. 5 వేల కోట్లకుపైగా కేటాయించామని వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పారు. అదానీ, అంబానీలతో పోటీపడి వ్యాపారం చేసేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాలు బాగుపడతాయని ముఖ్యమంత్రి సూచించారు. ఐదేళ్లలోపు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని తేల్చిచెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని వెల్లడించారు. మీరు అండగా ఉండండి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ నేత కేంద్రం మీద అలిగి ఫామ్ హౌస్ లో పడుకున్నారు.. చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం.. మనకే కదా? అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తా.. ఎవరేం అనుకున్నా నాకు ఇబ్బంది లేదని తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలి.. సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష నేత 40 ఏళ్ల అనుభవం ఉపయోగించి తమకు సలహాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుంటే.. ప్రజలే చూసుకుంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.