23-05-2025 10:36:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్, శాసన సభ్యులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థులు కృషితో మంచి ఫలితాలు సాధించారని, వారి విజయంలో భాగస్వాములైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గర్వంగా ఉందని, భవిష్యత్తులో మరింత స్థాయిలో రాణించి, జిల్లాకు గౌరవం తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్, ఎమ్మెల్యేలు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, పదవ తరగతిలో గొప్ప ఫలితాలు సాధించడం అభినందనీయమని, క్రమశిక్షణతో విద్యను కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రతిభ చూపుతున్నారు అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా విద్యాధికారి పి. రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.