calender_icon.png 28 August, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే

28-08-2025 08:53:32 AM

హైదరాబాద్: హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు(Telangana Rains) కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేయనున్నారు. తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వాటిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశించారు. హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు సిబ్బంది స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని చెప్పారు.

న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వాహాలు ఉంటే అక్క‌డ రాక‌పోక‌లు నిషేధించాల‌ని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్ర‌మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది(Health Department) ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 

భారీ వర్షాలు కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రిఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో(Kamareddy districts) యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాల సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.