28-10-2025 05:04:52 PM
హైదరాబాద్: రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారిగా విశ్లేషణలు జరగాలని స్పష్టంగా చెప్పారు. కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవల్యూషన్ సీడీఎస్ఈకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఇటీవల రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రి లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు వివరించిన ముఖ్యమంత్రి, అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల వారిగా సమగ్రమైన వివరాలతో విశ్లేషణలు జరగాలని, రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపైనా స్టేటస్ రిపోర్ట్‌లను తయారు చేయాలని ఆదేశాలిచ్చారు.
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపైనా సమావేశంలో మఖ్యమంత్రి సమీక్షించారు. బ్యారేజీల మరమ్మత్తులకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల వారీగా రూపొందించే పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా ప్రాజెక్టుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై సమీక్షలో చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే విధంగా ఈ ప్రణాళికలు సిద్ధం కావాలని చెప్పారు. ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు వీలుగా అంచనాలను తయారు చేయాలని సూచించారు. సుందిళ్లను మరమ్మత్తు చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.