28-10-2025 07:47:25 PM
మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి..
ఘట్ కేసర్: ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని మల్కాజిగిరి డీసీపీ పద్మజరెడ్డి అన్నారు. మంగళవారం ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎన్ ఎఫ్ సి నగర్ లోని సాయి సందీప్ కాలనీకి చెందిన విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన గ్రేహౌండ్స్ పోలీస్ తిక్క సందీప్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల సేవలు ఎప్పటికి మర్చిపోలేనివని పేర్కొన్నారు.
తిక్క సందీప్ కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని రకాలుగా ఆదుకుని అండగా ఉంటుందన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేరుగా సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా తిక్క సందీప్ భార్య పావని, తల్లి శోభ లను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఘట్కేసర్ ఇన్ స్పెక్టర్ ఎం. బాలస్వామి, పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ రాజువర్మ, ఎస్ఐలు ప్రభాకర్ రెడ్డి, శేఖర్, రాఘవేంద్ర, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.