calender_icon.png 28 October, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిటికల్ కేర్ యూనిట్ భవనంలోకి డయాలసిస్ విభాగం

28-10-2025 07:35:35 PM

వనపర్తి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న డయాలసిస్ విభాగాన్ని ఎం సీ హెచ్ వెనక నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రం శివారులో ఉన్న మెటర్నటీ చైల్డ్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో వర్షపు నీటి నిల్వను పరిశీలించిన కలెక్టర్ నిల్వ లేకుండా చేసేందుకు డ్రైనేజ్ కాలువలను నిర్మించి నీరు బయటకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవనం వెనుక వైపున ఇంకుడు గుంతలను తవ్వించాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ ఎం సి హెచ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెజర్ ఆక్సిజన్ ప్లాంట్ విభాగాన్ని పరిశీలించి వేగంగా వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. ఎం.సీ.హెచ్ తోపాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో త్వరితగతిన ఆక్సిజన్ వెంటిలెటర్ సదుపాయాన్ని వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీజీఎంఎస్ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న డయాలసిస్ విభాగం మొదటి అంతస్తులో ఉన్నందున రోగులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాబట్టి నవంబర్ 1 నాటికి జీజీహెచ్ లో ఉన్న డయాలసిస్ విభాగాన్ని నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనంలోకి తరలించేందుకు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. టీ హబ్ లో రిపేరుకు గురైన బయో కెమిస్ట్రీ యంత్రాన్ని వేగంగా మరమ్మతులు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ కు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, సూపర్డెంట్ రంగారావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు సాయినాథ్ రెడ్డి, పరిమళ,  టి జి ఎస్ ఎమ్ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.