28-10-2025 05:09:50 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
కరీంనగర్ (విజయక్రాంతి): ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అధికారులతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో నిజాయితీ పెంపొందించాలని అన్నారు. ప్రజా సేవలో పారదర్శకత, బాధ్యత చాలా ముఖ్యమని తెలిపారు.
ప్రతి ఉద్యోగికి పనిలో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ హెల్ప్ లైన్ నెంబర్ 14432, లోగోకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఆర్డీవో మహేశ్వర్, జెడ్పీ సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.