02-07-2025 07:30:15 PM
హైదరాబాద్: పదవ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్(Intermediate) పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తున్నప్పటికీ ఇంటర్మీడియట్ పూర్తయ్యే సరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల కారణాలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ఐసీసీసీ(Telangana Integrated Command and Control Centre)లో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు.
ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనందని, ఆ దశలో విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అమలు చేస్తున్నారని, అందువల్ల అక్కడ డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు వివరించారు. అలాంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్, ఆ విభాగంలో పని చేసే ఎన్‌జీఓలు, పౌర సమాజం సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యను పటిష్ఠపరచడానికి శాసనసభలోనూ చర్చకు పెడతామని, ఇంటర్‌లో విద్యార్థుల చేరకతో పాటు వారి హాజరుపైనా దృష్టిపెట్టాలన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ (Young India Residential School)నమూనాలను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలల నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్మాణాల ప్రగతిపై ప్రతివారం తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామన్నారు.
ఇప్పటికే ఒక్కో పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయినందున, రెండవ పాఠశాలకు సంబంధించిన స్థల గుర్తింపు, సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనాను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నతవిద్యా మండలి చైర్మన్ తో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.