05-09-2025 09:27:02 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ గణేష్‌కు సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ ఖైరతాబాద్ గణేశుడిని(Khairatabad Ganesh) దర్శించుకోనున్నారు. అటు నగరంలో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం అయింది. గణేష్ శోభాయాత్రలు 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్నాయని అధికారులు వెల్లడించారు. గణేష్ నిమజ్జనం(Ganesh immersion) కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 30 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
160 యాక్షన్ టీంలు రంగంలోకి దింపారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నిమజ్జనం కోసం 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు సిద్ధం, 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని జీహెచ్‌ఎంసీ( Greater Hyderabad Municipal Corporation) పురమాయించింది. 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. శనివారం 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బడ్ వద్ద నిమజ్జన సందడి కొనసాగుతోంది. అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు. సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.