calender_icon.png 5 December, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వస్తే అన్ని బంద్.. ఆనాటి సీఎం దుష్ప్రచారం

05-12-2025 05:28:28 PM

హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, రూ.200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మీ ఓటునే ఆయుధంగా మార్చి.. గడీల పాలనను కూల్చారని, ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతోందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ గడ్డకు చెందిన ఎందరో వీరులు తమ పరాక్రమాన్ని ప్రపంచానికి చూపారని, కాకతీయ యూనివర్సిటీ పోరాటాలు ఎప్పుడూ స్పూర్తినిస్తాయని కొనియాడారు. తెలంగాణ వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ జిల్లా ప్రజలు కూడా ఆశించారని, కూర్చీలో కూర్చొన్న వారి ఆస్తులు పెరిగాయి.. కానీ ప్రజల జీవితాలు మారలేదని ముఖ్యమంత్రి ఆగ్రహించారు. 

వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని ఆనాటి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారని, ఈ ప్రభుత్వం మాత్రం రైతు పండించిన చివరి గింజ వరకు కొంటోందన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని ఆనాటి సీఎం దుష్ప్రచారం చేశారని, కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అవుతుందని ప్రజలను బెదిరించారని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకున్న వారి పవర్ మాత్రమే కట్ అయ్యిందని, సాగుకు ఉచిత కరెంట్ పై పేటెంట్ హక్కు ఈ ప్రభుత్వానికి మాత్రమే ఉన్నదని వివరించారు.

గత సీజన్ లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుభరోసా కింద ఇచ్చామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిందని సీఎం విరుచుకుపడ్డారు. రుణమాఫీని 9 ఏళ్లపాటు సాగదీయడంతో అప్పుడు ఇచ్చిన డబ్బులు వడ్డీలకే సరిపోలేదని, సన్నవడ్లకు క్వీంటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, రేషన్ కార్డుల్లో కొత్తవారు మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆయన విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 1.10 కోట్ల కొత్త రేషన్ కార్డులను ఇచ్చిందని, గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం పేదవాడి ఆకలిని తీర్చలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.