calender_icon.png 23 September, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు నాణ్యతతో అందించాలి

23-09-2025 08:02:54 PM

వనపర్తి,(విజయక్రాంతి): ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు నాణ్యతతో అందించడంతో పాటు వైద్య శాఖకు సంబంధించిన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం లు జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ఎన్ఐసీ హాల్లో జిల్లా కలెక్టర్ వైద్య శాఖపై సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వస్త్ నారి సశక్త్ పరివార్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిగా ఇప్పటి వరకు ఎంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు, స్పెషలిస్ట్ వైద్యులు ఎవరెవరు వచ్చారు అనే వివరాలను అడిగారు.

స్వస్త్ నారి సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా  ఇప్పటి వరకు 10వేల పైచిలుకు వరకు పిల్లలు, మహిళలు ప్రత్యేక వైద్య పరీక్షలకు హాజరు అయ్యారని, రోజుకో స్పెషలిస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హాజరై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య అధికారి సమాధానం ఇచ్చారు.  స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చే ముందు రోజు ప్రజలకు సమాచారం ఇచ్చి వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. వనపర్తి హెల్త్ పోర్టల్ లో రోగుల వివరాలు నిక్షిప్తం చేసి వారికి సంక్షిప్త సందేశం వెళ్ళే విధంగా వారి సరైన వాట్సప్ నెంబర్లు పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు విధిగా ఆభా కార్డు రిజిస్టేషన్ చేయించాలని సూచించారు. 

జిల్లాలో ఈ సంవత్సరం 63 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని, డెంగ్యూ వచ్చిన ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టీ ఎంపీడీఓ, మున్సిపల్ అధికారుల సహకారంతో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి వైద్య పరీక్షలు, అవగాహన  కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.  అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు ఎ.ఎన్.సి రిజిస్ట్రేషన్  శాతం పెంచాలనీ అదేవిధంగా 5వ ఎ.ఎన్.సి. చెకప్ సైతం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు ఇమ్యూనైజేషన్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, సమయానుసారం పిల్లలకు, గర్భిణులకు ఇవ్వాల్సిన రోగనిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమం సజావుగా నిర్వహించాలన్నారు. ఏ ఒక్క పిల్లలు వ్యాక్సినేషన్ కు దూరం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.