25-08-2025 04:43:38 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మండల పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు, విద్య బోధన, వసతి, భోజనం అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యా బోధన మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఉండాలని ఆదేశించారు. వసతి సౌకర్యాలను పరిశీలించారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
కురవిలో అదనపు కలెక్టర్..
మహబూబాబాద్ జిల్లా కొరవిలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, మండల ప్రత్యేక అధికారి నరసింహ స్వామి యూరియా పంపిణీపై తహసిల్దార్ విజయ, ఏవో నరసింహారావుతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు కురవిలో గత ఏడాదితో పోలిస్తే 101.105 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా పంపిణీ చేయడం జరిగిందని, యూరియాకు కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.