25-08-2025 06:30:45 PM
భిక్కనూరు,(విజయక్రాంతి): పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని ఎస్ఐ ఆంజనేయులు అన్నారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల వలన, నీళ్లు కలుషితమై ఎన్నో జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన విగ్రహాలనే పూజించాలని కోరారు. 1000 మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన భారతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, న్యాయవాది లింగాల రాజబాబు గౌడ్ ను ఆయన అభినందించారు.