13-08-2025 06:22:26 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ లోని ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సత్య శారద(District Collector Satya Sharada)తో పాటు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు(MLA KR Nagaraju), మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్, నగర మేయర్ గుండు సుధారాణిలు ముంపు ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో నీట మునిగిన ప్రాంతాలను పర్యవేక్షించాలని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని, అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని, భారీ వర్షాలు నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముంపు ప్రాంతాల ప్రజలని పునరావస కేంద్రంలో తరలించాలని, వారికి కావలసిన అన్ని చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నాలాలను కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపట్టే వారిపై కొరడా గెలిపించాలని ఆదేశాలు జారీ చేశారు.
14వ డివిజన్లోని ఎస్సార్ నగర్, 100 ఫీట్ల రోడ్డు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరిన బాధితులను పరామర్శించారు. ప్రజలు అధైర్య పడద్దని మరో 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆహారంతోపాటు మంచినీళ్లు, మెడిసిన్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. వ్యవస్థ తీరును మెరుగుపరచాలని ఆదేశాలను జారీ చేశారు. వరద ప్రాంతాలలో మరమ్మత్తులు చేపట్టేందుకు 30 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని నిధుల కోసం ముఖ్యమంత్రిని కలవనున్నట్లు నగర పరిస్థితులను తెలియజేయునట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, కార్పొరేటర్ సులోచన సారయ్య అధ్యక్షులు, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.