calender_icon.png 21 November, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతమడక పిహెచ్‌సీనీ కలెక్టర్ హైమవతి ఆకస్మిక తనిఖీ

21-11-2025 05:23:14 PM

సిబ్బంది గైర్హాజరు.. కలెక్టర్ ఆగ్రహం

సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక పిహెచ్‌సీని జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలను, అటెండెన్స్ ఓపి రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ సిబ్బంది హాజరు నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిహెచ్‌సీలో ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ మాత్రమే విధుల్లో ఉండగా, మెడికల్ ఆఫీసర్ సహా మిగతా సిబ్బంది గైర్హాజరు కావడం కలెక్టర్‌ను ఆగ్రహపరిచింది.

మెడికల్ ఆఫీసర్ సెలవుపై ఉన్నట్టు సిబ్బంది చెప్పటంతో “డీఎంఅండ్‌డీఎచ్ఓ అనుమతి తీసుకున్నారా?” అని ఫోన్‌ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అనుమతి లేకుండా సెలవులు, సమయాలు పాటించకపోవడం వంటి బాధ్యతారాహిత్యాన్ని సహించబోనన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా లేని ప్రతి ఒక్కరిపై జీతాల్లో కోతతోపాటు కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. “ప్రభుత్వం భవనాలు, పరికరాలు, సిబ్బంది అందిస్తోంది… ప్రజలకు సేవా ధృక్పథంతో పనిచేయాలి” అని సూచించారు.

పుల్లూరులో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

రైతులకు చెల్లింపుల్లో ఆలస్యం జరగొద్దని ఆదేశాలు

అనంతరం కలెక్టర్ హైమవతి పుల్లూరు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్యటించారు. వరి కొనుగోలు, డిజిటల్ ఎంట్రీలు, లోడింగ్ ప్రక్రియలను సమీక్షించారు. రోజువారీ లోడింగ్ పూర్తవగానే ట్రక్‌షీట్ తప్పనిసరిగా జెనరేట్ చేయాలని, రైతులకు చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం చోటు చేసుకోకూడదని ఆదేశించారు.

సెంటర్‌లో లోడ్ అవుతున్న ధాన్యాన్ని అన్నదాత మిల్ గాడిచర్లపల్లి, లక్ష్మీ నర్సింహ మిల్ పుల్లూరు మిల్లులకు పంపుతున్నట్టు సిబ్బంది వివరించారు. తేమ శాతం నిర్ధారించిన వెంటనే గన్నెల్లో నింపి లోడింగ్ చేయాలని సూచించారు. అకాల వర్షాల అవకాశం దృష్టిలో ఉంచుకుని టార్పాలిన్ కవర్లు తప్పనిసరిగా వాడాలని రైతులకు సూచించారు. సెంటర్‌లో అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.