ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఒక్క అర్హ ఓటరు మిగలొద్దు
అప్పాయిపల్లిలో డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
అచ్చంపేట, (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. గురువారం లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలోని 254, 256, 258 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఓటర్ల వివరాల నమోదు, ధ్రువీకరణ, డిజిటలైజేషన్ పురోగతిపై బీఎల్‌వోలతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో మొత్తం 2,440 మంది ఓటర్లలో సుమారు 2,000 మందికి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన వారిలో డోర్‌లాక్ కేసులు, ద్వంద్వ ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్లు జాబితాలో ఉండటం వంటి కారణాలతో ప్రక్రియ పెండింగ్‌లో ఉందన్నారు.
కొంతమంది ఓటర్లకు ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాలు అందలేదని గ్రామ సర్పంచ్ విజయ్‌కృష్ణ, బీఎల్‌వోలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రతి ఇంటికి వెళ్లి అర్హులందరికీ దరఖాస్తులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డోర్‌లాక్ కేసులను మరోసారి పరిశీలించి, ద్వంద్వ ఓటర్లు, మరణించిన వారి వివరాలను నిబంధనల ప్రకారం ధ్రువీకరించి జాబితాను ఖచ్చితత్వంతో రూపొందించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి పారదర్శక ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.






