25-07-2025 08:47:49 PM
పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ హెచ్చరిక
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
దేవరకొండ: నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీల వారిగా నిర్వహించిన సమీక్ష సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... జాబితాలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లయితే అందుకు బాధ్యులైన వారిని అవసరం అయితేప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా తయారీలో గ్రామపంచాయతీ కార్యదర్శులు సీరియస్ గా తీసుకోవాలని ,అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే ఇందిరమ్మ ఇండ్లకు సిఫారసు చేయాలన్నారు.
ఎల్ 3 నుండి ఎల్ 1 కు వచ్చి మంజూరైన ఇండ్లను తక్షణమే గ్రౌండ్ చేయాలని ఆదేశించారు .డిండి మండలంలో ఎల్ 3 జాబితా పై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త జాబితాను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇల్లు మంజూరై కట్టుకునేందుకు ఆర్థిక పరిస్థితి బాగాలేని మహిళలకు స్వయం సహాయక మహిళ సంఘాల నుండి రుణమిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ ను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అలాంటి వారి జాబితాను తక్షణమే సమర్పించాల్సిందిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి,డిండి ఎంపీడీవో వెంకన్న, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.