26-07-2025 11:28:26 AM
పిల్లలతో కలిసి అల్పాహారం చేసిన కలెక్టర్
మంచిర్యాల, (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఎస్సీ షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహాన్ని శని వారం ఉదయం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వర్షా కాలం నేపథ్యంలో నాణ్యమైన కూరగాయలు ఉపయోగిస్తున్నారో, లేదో పరీక్షించారు. వంటగదిని, గదులు, టాయిలెట్లు, చదువు గదులు పరిశీలించి, వాటి నిర్వహణపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తున్నారో, లేదోనని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో శుభ్రత, ఆరోగ్యం, భద్రత, విద్యా ప్రోత్సాహంపై అధికారులకు పలు సూచనలు చేశారు. పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు నెలకు ఒక్కసారి వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.
వడ్డించి.. కలిసి భోజనం చేసి...
శని వారం ఉదయం పూట కలెక్టర్ కుమార్ దీపక్ వసతి గృహాన్ని తనిఖీకి వెళ్లి దగ్గరుండి అల్పాహారం కిచిడీని విద్యార్థులకు వడ్డించారు. అనంతరం వారితో కలిసి కూర్చొని టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ వారి అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. పిల్లలు కూడా కలెక్టర్ ని చూసి ఉత్సాహంగా స్పందిస్తూ కలెక్టర్ తో మాట్లాడారు. కలెక్టర్ వెంట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ఉప సంచాలకులు చాతరాజుల దుర్గా ప్రసాద్, ఏ ఎస్ డబ్ల్యూ ఓ రవీందర్, హాస్టల్ వెల్ఫేర్ అధికారి (హెచ్ డబ్ల్యూ ఓ) చందన, సిబ్బంది తదితరులున్నారు.