calender_icon.png 20 August, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

19-08-2025 11:58:53 PM

హనుమకొండ,(విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యసేవల నిమిత్తం ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంతమంది వస్తుంటారని కలెక్టర్ అడిగి తెలుసుకుని ఇన్ పేషెంట్ ఔట్ పేషెంట్ కు సంబంధించిన రికార్డులను  తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జ్వరాల కేసుల నమోదు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఏయే వ్యాధులకు సంబంధించిన రిపోర్టులను  ఏ విధంగా తెప్పించుకుంటున్నారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి  కావాల్సిన మందుల ఇండెంట్ ను సంబంధిత పోర్టల్ లో ఏ విధంగా నమోదు చేస్తున్నారని కలెక్టర్ పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మందుల నిల్వను పరిశీలించారు. అదేవిధంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఎంతమందికి  వైద్య పరీక్షలు నిర్వహించారని, హై రిస్క్ గ్రూపుల వారికి స్క్రీనింగ్ పరీక్షలు  ఏ విధంగా నిర్వహిస్తున్నారని వైద్యాధికారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

టీవీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 820 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశామని, ఇందులో 84 మందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారి డాక్టర్ అరుణ దేవి కలెక్టర్కు తెలియజేశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హై రిస్క్ గ్రూపుల వారికి స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలని సూచించారు. ప్రణాళిక మేరకు ఎక్కువ సంఖ్యలో స్క్రీనింగ్ పరీక్షలు  చేయాలన్నారు. గ్రామాలలో జ్వర సర్వేను నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన ఇప్పించాలని కలెక్టర్ సూచించారు.