6 August, 2026 | 7:39 PM

ముత్తారంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష

06-08-2026 06:28 PM

క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

మిషన్ భగీరథ లోపాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి 

 జలసిరి, వీబీజీ–రామ్‌జీ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం

పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.  గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ముత్తారం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ వివిధ శాఖల పనితీరును సమీక్షించారు.

వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, ఐసీడీఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, నీటిపారుదల, విద్యుత్, ఉద్యానవనం, రవాణా, ఆర్ అండ్ బీతో పాటు వీబీజీ–రామ్‌జీ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు గ్రామాల్లో తరచూ పర్యటించాలని ఆదేశించారు.

మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా పైప్‌లైన్ వ్యవస్థలో ఉన్న లోపాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి, అవసరమైన నిధుల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ శాఖ రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, యూరియా సరఫరా పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు సమయపాలనతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

వీబీజీ–రామ్‌జీ పథకం కింద చేపడుతున్న జలసిరి కార్యక్రమంలోని ఇంకుడు గుంతలు, పంటకుంటలు తదితర అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి ఎం. రవీందర్, ఎంపీడీవో ఐ. ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.