విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి
మఠంపల్లి,(విజయ క్రాంతి): ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా కరెంట్ షాక్కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన, మఠంపల్లి మండల పరిధిలోని రామచంద్రపురం తండా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ(19),తండ్రి కేవల్య,వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం పొలం మీదుగా వెళ్లే విద్యుత్ తీగలు ప్రమాదకరంగా చాలా కిందకు వేలాడుతూ ఉండగా,వాటిని మణికంఠ గమనించలేదు.
ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో అతని చేయి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మఠంపల్లి ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






