calender_icon.png 23 September, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య రంగాన్ని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం

23-09-2025 05:44:03 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్య ఇబ్బందిని నియమించి మందులను అందుబాటులో ఉంచి ప్రజల సంక్షేమం కొరకు తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రి పరిధిలో కొనసాగుతున్న క్యాంటీన్, మార్చురీ గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. దసరా సెలవులు ముగిసి పాఠశాల ప్రారంభం లోపు పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తో కలిసి అమృత్ 2.0 పథకంలో నీటి ట్యాంకుల ద్వారా నిరంతరం త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, నివాస ప్రాంతాలలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీటిని సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.