calender_icon.png 29 August, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవనాల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

29-08-2025 08:37:06 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): జిల్లాలో గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి చదువులు కొనసాగేందుకు భవనాల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా తో కలిసి సాంఘిక సంక్షేమ గురుకులాల అధికారులు, మున్సిపల్ అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల సిర్పూర్ - టి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనం శిథిలావస్థలో ఉన్నందున అక్కడి విద్యార్థులను ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలలో సత్తుపాటి చేసినందున విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆటంకం కలగకుండా కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీ నగర్ లో గల సుప్రభాత్ పాఠశాల భవనంలో పాఠశాల/కళాశాలను కొనసాగించేందుకు అవసరమైన భవన సదుపాయం కొరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సిర్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు విద్యా అభ్యసిస్తున్నారని, వారికి సరిపడా భవన సదుపాయం, తరగతి గదులు, వంటశాల, త్రాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు ఉండేలా చూసి నివేదికలు అందించాలని తెలిపారు. ఆయా ప్రాంతాలలో ఉండే అద్దె వివరాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం వరంగల్ జోనల్ అధికారి అరుణకుమారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.