calender_icon.png 29 August, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు సమర్పించాలి

29-08-2025 08:33:05 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఓటర్ల ముసాయిదా జాబితా పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 తేదీలోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల ఓటర్ల జాబితా అభ్యంతరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేయడం జరిగిందని, ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 28వ తేదీన అన్ని గ్రామపంచాయతీలలో, మండల కార్యాలయాలలో ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 30వ తేదీన అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితాలోని పేర్లు, పోలింగ్ కేంద్రాల పై అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు.

ఈ నెల 31 వ తేదీన అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2 వ తేదీన తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో గ్రామీణ ఓటర్లు 3 లక్షల 53 వేల 904 మంది ఉన్నారని, 335 గ్రామపంచాయతీలు, 2 వేల 874 వార్డులు ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థలలో అర్హత గల ఓటర్లు తమ ఓటు అవకాశాన్ని వినియోగించుకునే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని తెలిపారు.