16-08-2025 12:02:50 AM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని భవనాలలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కం ఎక్సలెన్స్ సెంటర్ లో స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న క్లాస్ రూమ్స్, ఎంతమందికి వసతి సదుపాయాలను కల్పిస్తున్నారనే వివరాలను జిల్లా యువజన క్రీడాధికారి గుగులోత్ అశోక్ కుమార్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి ఎప్పటి వరకు పనులను పూర్తి చేస్తారని ఇంజనీరింగ్ అధికారులు, క్రీడల శాఖ అధికారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.