04-10-2025 06:50:20 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పునాది దశ వరకు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను కలిసి, వారికి మొదటి విడత బిల్లు మంజూరు అయ్యిందా అని ఆరా తీశారు. ఇంకనూ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్దిదారులతో భేటీ అయ్యి, పనులు ఎందుకు ప్రారంభించలేదని కారణాలు అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక, మంజూరీ ప్రక్రియలలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో సైతం ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే ప్రభుత్వ సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, మంజూరీలు తెలుపబడిన వారందరూ ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని, అవసరమైతే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని లబ్దిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద రుణం అందించేలా చొరవ చూపాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని, నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం తరఫున అందిస్తున్న తోడ్పాటు గురించి తెలియజేస్తూ, వారు నిర్మాణాలు చేపట్టేలా అవసరమైన సహకారం అందించాలని అన్నారు. ఆయా దశల ఇళ్ల నిర్మాణాలను అనుగుణంగా లబ్దిదారుల ఖాతాలలో బిల్లులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాను తదుపరి తనిఖీలు జరిపే సమయానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. అలసత్వానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అభయహస్తం కాలనీ సందర్శన
కాగా, దుబ్బ ప్రాంతంలోని అభయహస్తం కాలనీని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. ప్రభుత్వ అసైన్డ్ భూమిని పరిశీలించిన కలెక్టర్, జాయింట్ సర్వే జరిపి హద్దులను నిర్ధారించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, డీ.ఈ నివర్తి, మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు అధికారి రమేష్, నార్త్ తహసీల్దార్ విజయ్ కాంత్ తదితరులు ఉన్నారు.