20-08-2025 12:06:02 AM
గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలందించే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవు అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ హెచ్చరించారు. గరిడేపల్లి మండలంలో మంగళవారం ఆయన నాలుగు గంటలకుపైగా సమయం కేటాయించి ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడి కేంద్రాలు, సహకార సంఘాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,నర్సరీలను ఆయన పరిశీలించారు. మండలంలో పనిచేస్తున్న అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు.
మండలంలోని కొన్ని శాఖలలో పనిచేస్తున్న అధికారుల తీరుపై ఆయన ఆరా తీశారు.అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.రైతులకు అందించే యూరియా విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని పొనుగోడు గ్రామంలో సహకార సంఘం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రం పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎరువుల దుకాణాన్ని ఆయన్ని పరిశీలించి యూరియా నిల్వలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొనుగోడు లోని జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలను, గరిడేపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులచే కొన్ని పాఠాలను చదివించారు. పలు రకాల ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. విద్యార్థులు మంచిగా చదువుకొని తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పాఠశాలలో చదువులు వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకమైన తరగతులు నిర్వహించాలని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పొనుగోడు పాఠశాలలో ఒకే ఆవరణలో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉండటంతో రెండు పాఠశాలలకు కలిపి వంటలు వండించాలన్నారు. వంటలు వండేందుకు కట్టెలు కాకుండా గ్యాస్ ను ఎందుకు వినియోగించటం లేదని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గరిడేపల్లిలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని పరిశీలించారు.అక్కడ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి నరేష్ ని ఎంతమంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య ఆరోగ్య సిబ్బంది మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి వెళ్తుండగా అక్కడే వ్యవసాయ కార్యాలయం పక్కనే అసంపూర్తిగా నిర్మాణం తో ఉన్న స్త్రీ శక్తి భవనం విషయం విలేకరులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే డి.ఆర్.డి.ఏ కు ఫోన్ ద్వారా సమాచారం అందించి తెలుసుకున్నారు.అసంపూర్తిగా ఉన్న ఆ భవనాన్ని పూర్తిగా నిర్మించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
సంబంధిత అధికారులకు నిర్మాణానికి అయ్యే ఖర్చులపై నివేదిక అందించాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన నర్సరీని పరిశీలించి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన మొక్కని పెంచేందుకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అక్కడే ఉన్న జర్నలిస్టులను మీరు కూడా మొక్క నాటండి అని చెప్పి వారి చేతుల మీదుగా కలెక్టర్ మొక్కను నాటించారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధన మేరకే ఇండ్లు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో సుత్తారి మేస్త్రీలు కొలతలకు, అధికారులు ఇచ్చిన కొలతలకు వ్యత్యాసం ఉంటుందని దీంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
అంతేకాక ఆధార్ కార్డులో పేరు మార్చుకునేందుకు అవకాశం ఉందని, కానీ ఆధార్ నెంబర్ మార్చే మాడిఫికేషన్ లేకపోవడంతో లబ్ధిదారులు, సంబంధిత అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం కూడా ఆయన దృష్టికి తీసుకువచ్చారు.పిల్లర్లు లేకుండా నిర్మించాలని అధికారులు చెబుతుండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో పిల్లలతో నిర్మించినవి దాదాపు పూర్తి కావచ్చాయని,కొత్తగా ప్రారంభమయ్యే ఇందిరమ్మ ఇల్లు కూడా పిల్లర్లతోనే నిర్మించేందుకు లబ్ధిదారులు సిద్ధపడుతున్నారని ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయాలపై ఆయన స్పందిస్తూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అధికారుల కొలతల ప్రకారమే నిర్మించాలని, నిర్మాణానికి ముందే కొలతలు లబ్ధిదారులకు అందిస్తున్న విషయం ఆయన చెప్పారు.
ఆధార్ కార్డు పేరుతో పాటు నంబర్ కూడా నోటిఫికేషన్ ఉండేవిధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఇక ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం బేస్మెంట్ తో నిర్మించుకోవాలని సూచించిందని, అయితే అందరూ పిల్లర్లని ఉపయోగించి నిర్మిస్తున్నారని,పిల్లర్లతో నిర్మించే విషయం లబ్ధిదారుల ఇష్టానికి వదిలి వేస్తున్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల విషయంలో లబ్ధిదారులు ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటే ఆ సమస్యను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తామని తెలిపారు.అనంతరం గరిడేపల్లిలోని రెవిన్యూ కార్యాలయంలోకి వచ్చి సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.కార్యాలయ సిబ్బంది పనితీరుపై వస్తున్న పలు ఆరోపణలపై ఆయన చర్చించినట్లు సమాచారం.ప్రజలకు సేవలు అందించే విషయంలో రెవెన్యూ సిబ్బంది తన పని తీరును మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది.
కలెక్టర్ పర్యటనలో అపశృతి:
గరిడేపల్లి మండలంలో నాలుగు గంటలకు పైగా సమయాన్ని కేటాయించిన కలెక్టర్ పర్యటనలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. కలెక్టర్ వాహనం వెనుక మండల తాసిల్దార్ వాహనం వెళ్తుంది. గరిడేపల్లికి చేరుకొని ఎరువుల దుకాణం ముందు ఆగినప్పుడు మండల వ్యవసాయ అధికారి ప్రియతమ కుమార్ తాసిల్దార్ వాహనం నుంచి దిగుతున్న సమయంలో వాహనం కదలడంతో వ్యవసాయ అధికారి అరికాలు చివరి భాగం నుంచి వాహనం టైర్ ఎక్కటంతో గాయమైంది. తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో వ్యవసాయ అధికారి ప్రీతం కుమార్ ను కలెక్టర్ వచ్చి పరిశీలించి చికిత్స కోసం కలెక్టర్ వాహనంలోకి రమ్మన్నారు.అక్కడే ప్రాథమిక చికిత్స కేంద్రం ఉండటంతో చికిత్స చేయించుకుంటానని ఆయన చెప్పడంతో వెంటనే ఆర్ఐ రాంబాబును వ్యవసాయ అధికారిని దగ్గర ఉండి చికిత్స చేయించమని ఆదేశించారు.