14 August, 2026 | 1:19 AM

విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలి

02-09-2025 05:01 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, వంట సరుకులు, కూరగాయలు, తరగతి గదులు, హాజరు పట్టికలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని తెలిపారు.

విద్యార్థుల హాజరు శాతంపై ప్రధానోపాధ్యాయురాలని వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకూడదని, దీర్ఘకాలంగా పాఠశాలకు హాజరు కాని విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, గణితం, ఆంగ్లం, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు ఇప్పటి నుండి సన్నద్ధం చేయాలని తెలిపారు.

పాఠశాల పరిసరాలు, స్నానపు గదులు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతపై విద్యార్థులకు వివరించాలని తెలిపారు. ఆరోగ్య కార్యకర్త 24 గంటలు అందుబాటులో ఉండి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. తరగతి గదులు విద్యార్థులకు సబ్జెక్టులలో పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.