calender_icon.png 16 May, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్

16-05-2025 12:35:19 AM

నిజామాబాద్, మే 15 (విజయ క్రాంతి): రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులర్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ సీడబ్ల్యూఎస్‌ఎన్ (చైల్ విత్ స్పెషల్ నీడ్) అంశంపై ఐదు రోజుల శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు.

ఇందులో భాగంగా శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, బోధనా సామర్ధ్యాలను మెరుగుపర్చే దిశగా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తున్న తీరును పరిశీలించారు. ప్రత్యేకించి గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్న అంశాల గురించి స్టేట్ రిసోర్స్ పర్సన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో, ఆకట్టుకునే విధంగా పాఠాలను ఎలా బోధించాలి, అభ్యాసన సామర్థ్యాలను ఎలా పెంపొందించాలి అనే దానిపై అందిస్తున్న శిక్షణను కలెక్టర్ ఆయా తరగతి గదులను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి స్టేట్ రిసోర్స్ పర్సన్లు అవగాహన కల్పించారు.

శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకుని, నేర్చుకున్న అంశాలను తరగతి గదులలో పాటిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులకు హితవు పలికారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ, వారి బంగారు భవిషత్తుకు బాటలు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఇతర అధికారులు ఉన్నారు.