16-05-2025 12:36:13 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల, మే 15 (విజయక్రాంతి): జిల్లాలో పారదర్శకంగా నిరు పేదలను యువ వికాసం లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ యువ వికాసం పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం క్రింద మనకు 36 వేల 819 దరఖాస్తులు వచ్చాయని, వీటిని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి 30 వేల 627 దరఖాస్తులను బ్యాంకులకు ఫార్వర్డ్ చేశామని , 6 వేల 192 దరఖాస్తులను వివిధ కారణాల చేత తిరస్కరించామని అన్నారు.
బ్యాంకులు 30 వేల 627 దరఖాస్తుదారుల బ్యాక్ గ్రౌండ్ స్క్రూట్ ని పూర్తి చేశాయని తెలిపారు. గంభీర్ రావు పేట మండలంలో దళారులు యువ వికాసం పథకం క్రింద యూనిట్ ఇప్పిస్తామని ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుందని, పారదర్శకంగా యువ వికాసం యూనిట్ల ఎంపిక జరుగుతుందని ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
దళారుల ఒత్తిడి లేకుండా పేదలకు మాత్రమే పథకం అందాలని, ఎక్కడైనా అనర్హులకు చేరితే సమానత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలను మోసగిస్తున్న దళారుల పట్ల కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ శేషాద్రి, ఎల్ డి ఎం మల్లికార్జున్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి భారతి బీసీ వెల్ఫేర్ అధికారి రాజ మనోహర్ ఈ.డి.ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.