01-11-2025 12:27:35 AM
వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహించింది. కోర్టు తీర్పును గౌరవించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంలో సోమవారం కోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యేందుకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అనుమతి కోరగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ‘అధికారులు కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా నిద్రపోతున్నారు.
పలుమార్లు ఆదేశాలిచ్చినా వారు అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేయలేదో వ్యక్తిగతంగా వచ్చి వివరించాలి. కోర్టు సమయం ఇచ్చినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దురదృష్టకరం’ అని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆగ్రహించింది. ‘మా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వండి’ అని బీహార్ ప్రధాన కార్యదర్శి చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ‘రాష్ట్రంలో అంతా ఎన్నికల సంఘం బాధ్యత తీసుకుంటుంది.
మీరు బాధపడొద్దు.. చింతించొద్దు.. కోర్టుకు రండి’ అని స్పష్టం చేసింది. వీధికుక్కల కేసు విషయంలో ఆగస్టు 11న ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో దాన్ని త్రిసభ్య ధర్మాసనం సవరించిన విషయం తెలిసిందే. తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయి. మళ్లీ కుక్కల దాడుల ఘటనలు జరుగుతుండడంతో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అభ్యర్థననూ తోసిపుచ్చింది.