01-11-2025 09:56:19 PM
గంజాయి స్వాధీనం, నలుగురు వ్యక్తులు అరెస్ట్
విలేకరుల సమావేశంలో సీఐ కమలాకర్..
జడ్చర్ల: మాదకద్రవ్యాల దరిచేరకుండా ఉండాలని సీఐ కమలాకర్ అన్నారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి (క్యానబిస్) విక్రయించబోయే నలుగురు వ్యక్తులను పట్టుకొని, వారివద్ద నుండి గంజాయి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శనివారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో, జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు ఎన్ హెచ్ 44 దగ్గర ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్న సమయంలో ఎన్ హెచ్ 44 లోని ఇన్స్పెక్షన్ బంగ్లా సమీపంలో నలుగురు అనుమానాస్పద వ్యక్తులు కనిపించి, పోలీసులు వారిని చేరుకోవడానికి ప్రయత్నించగా, వారు పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించారని తెలిపారు.
పోలీసులు వెంటపడి వారిని అదుపులోకి తీసుకొని, వారిని విచారించగా, వారి వద్ద నల్ల రంగు ప్లాస్టిక్ కవర్లలో గంజాయి ఉన్నట్లు బయటపడిందన్నారు. అబ్బు తాలిబ్, గుండు హరిప్రసాద్, ఎం.డి. ఆజర్ అలీ, మంద కార్తీక్ లను అదుపులోకి తీసుకోవడంతో పాటు రెండు వందల గ్రాముల గంజాయి విలువ రూ.10 వేలు, నాలుగు మొబైల్ ఫోన్లు విలువ రూ.25000 ఉంటుందని ఎస్సై తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం కోసం పోలీసులు నిరంతరం పహారా, రహస్య సమాచారంపై కఠినంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సై కే మల్లేష్, వెంకట్ రెడ్డి, భీమేష్, నర్సింలు, నాగరాజు, విష్ణు పోలీస్ అధికారులు ఉన్నారు.