calender_icon.png 1 November, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్‌ఎన్‌ను నిషేధించాల్సిందే!

01-11-2025 12:25:59 AM

  1. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు
  2. దేశంలో శాంతిభద్రతల సమస్యలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే కారణం
  3. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమన్న ఖర్గే

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశంలో ఎక్కువుగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ కారణమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాల్సిందేనని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఖర్గే స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సృష్టించిందన్నారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ నాటి హోం మంత్రి పటేల్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీకి లేఖ రాశారని గుర్తు చేశారు.

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శిస్తూ పటేల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్, ఉక్కు మహిళ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి ఎంతో సేవ చేశారని, వారు గొప్ప నేతలని ఖర్గే పేర్కొన్నారు.

దేశ ఐక్యతను కాపాడేందుకు ఎంతో కృషి చేశారన్నారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ల మధ్య గొప్ప సంబంధాలు ఉన్నప్పటికీ వారి మధ్య చీలిక తెచ్చేందుకు నిత్యం ప్రయత్నించేవారని దుయ్యబట్టారు. దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన పటేల్‌ను నెహ్రూ ప్రశంసించారని, పటేల్ కూడా నెహ్రూ దేశానికి ఆదర్శంగా అభివర్ణించారని పేర్కొన్నారు.

కశ్మీర్ మొత్తాన్ని దేశంలో కలపాలని పటేల్ కోరుకున్నారని, కానీ నాటి ప్రధాని నెహ్రూ ఆ ప్రయత్నాలను జరగనివ్వలేదంటూ ప్రధాని మోదీ ఆరోపించడంపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. దశాబ్ధాలపాటు పటేల్ చేసిన సేవలను కాంగ్రెస్ విస్మరించిందని పేర్కొంది.