10-09-2025 12:56:28 AM
-నూతన టెక్స్‌టైల్స్ పాలసీ రూపొందిస్తున్నాం
-సులభతర పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం
-తిరుపూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణలో దుస్తుల (అప్పెరల్) పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా రాష్ర్ట ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తమిళనాడులోని తిరుపూరు దుస్తుల తయారీ పరిశ్రమల యాజ మాన్యాలను ఆహ్వానించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రపంచస్థాయి మౌలిక వసతులు తెలంగాణలో సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు.
తమిళనాడులోని కో యంబత్తూరు, తిరుపూరులను మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం సందర్శించి.. అక్కడి పారిశ్రామికవర్గాలు, ఎగుమతిదారులతో మాట్లాడారు. అతిపెద్ద అప్పెరల్ తయారీ కేంద్రంగా తిరుపూరు గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని మంత్రి శ్రీధర్‌బాబు కితాబిచ్చారు. 10 వేల దుస్తుల పరిశ్రమలతో ‘నిట్ వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తిరుపూరు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని మంత్రి ప్రశంసించారు.
దేశంలోని 90 శాతం దు స్తులు, క్యాజువల్ వేర్, స్పోర్ట్స్ వేర్, సాక్సు లు, టోపీల లాంటి కాటన్ ఉత్పత్తులు తిరుపూరు నుంచే ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. 1990 నుంచి తిరుపూరు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన దుస్తులను ఎగుమతి చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాణ్యతతో కూడిన రెడీమేడ్స్ తయారీకి అవసరమయ్యే లాంగ్ స్టేపుల్ (పొడవు పోగుల) కాటన్ తెలంగాణలో స మృద్ధిగా అందుబాటులో ఉందని శ్రీధర్‌బాబు వారికి వివరించారు.
రౌండ్ టేబుల్ సమావేశానికి రండి..
తెలంగాణ వ్యవసాయ, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మంత్రి దుద్దిళ్ల పారిశ్రామికవేత్తలను కోరారు. త్వరలో దీనికి సంబంధించిన సమాచారం అందజేస్తామని తెలిపారు. అందరితో చర్చించిన తర్వాత తెలంగాణ నూతన టెక్స్ టైల్స్ పాలసీని రూపొందిస్తామని వెల్లడించారు. అమెరికా విధించిన 50 శాతం సుంకాల నేపథ్యంలో ఎగుమతులు దెబ్బతిన్నాయని, ఈ సమయంలో వస్త్ర పరిశ్రమ చేపట్టాల్సిన కార్యాచరణపైన కూడా చర్చించొచ్చని శ్రీధర్‌బాబు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన హీరో ఫ్యాషన్ గ్రూప్ (రామ్ రాజ్ కాటన్స్) చైర్మన్ కేఆర్ నాగరాజన్, ఎండీ సుందరమూర్తిని ప్రత్యేకంగా కలిశారు. సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ (సిమా) సెక్రటరీ జనరల్ కే సెల్వరాజ్, సంస్థ సభ్యులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. సులభతర పారిశ్రామిక విధానాల అమలుతో తమ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
తిరుపూరు ఎగుమతిదారుల సంఘం గౌరవ చైర్మన్ డాక్టర్ ఏ శక్తివేలు, అధ్యక్షుడు కేఎం సుబ్రమణియన్, కార్యవర్గ సభ్యులు తితుకుమరన్, కుమార్ దొరైస్వామి, సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్‌కు చెందిన కే సెల్వరాజ్, గోపీ కుమార్ (చంద్ర గ్రూప్), ప్రతినిధి ఎం ప్రభు దామోదరన్ (ఇండియన్ టెక్స్ ప్రెన్యూర్స్ ఫెడరేషన్ కోయంబత్తూరు)లతో శ్రీధర్‌బాబు సమావేశ మయ్యారు. పెట్టుబడులతో వస్తే వారికి కావాల్సిన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు తిరుపూరులోని నేతాజీ అప్పెరల్ పార్క్‌ను సందర్శించి ఇండస్ట్రీ ప్రతినిధులతో మాట్లాడారు. పర్యటనలో టీజీఐఐసీ ఎండీ శశాంక, తెలంగాణ టెక్స్ టైల్స్, అప్పెరల్ విభాగం డైరెక్టర్ ధరణి కుమార్ కోగంటి పాల్గొన్నారు.