10-09-2025 02:36:06 PM
కేసీఆర్ సీఎం కావాలంటే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తా చూపాలి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), గంగుల కమలాకర్, గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుపే గోపీనాథ్ కు సరైన ఘన నివాళి అన్నారు. ఓటుకు రూ. 5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.
సీఎం సోదరుడు చెరువుల్లో ఇళ్లు కట్టినా హైడ్రా పోదని ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక కోసం సర్వేలు చేయిస్తున్నాం.. పార్టీ పరిస్థితి బాగుందని కేటీఆర్ సూచించారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి.. లేనివారిని చేర్చాలని ఎన్నికల అధికారులను కోరారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు బంద్ చేస్తామని.. ఇళ్లు కూలుస్తామని అంటారు.. పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మూసీ ప్రాజెక్టుకు డబ్బులు ఉన్నాయట అన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సత్తా చూపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరని ఆరోపించిన కేటీఆర్ జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలన్నారు.