calender_icon.png 10 September, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ పిట్లం రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని..

10-09-2025 03:11:00 PM

బాన్సువాడ ఆర్అండ్ బి కార్యాలయం ముందు బిఆర్ఎస్ నేతల ధర్నా... 

బాన్సువాడ, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి కార్యాలయం ముందు బాన్సువాడ పిట్లం రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బి ఆర్ ఎస్ నేతలు గంటపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు జరిపించాలంటూ ఆర్ అండ్ బి అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా నుండి జుక్కల్ వరకు రోడ్లన్నీ గతుకులమయమై అధ్వానంగా మారిపోయినప్పటికీ మరమ్మత్తులు జరిపి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే సోయి లేకుండా పోయిందని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాన్సువాడ నిజాంసాగర్, బాన్సువాడ పిట్లం, బాన్సువాడ బిచ్కుంద రోడ్లన్నీ గుంతల మయమై ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆయన పేర్కొన్నారు.

రాత్రి వేళల్లో కొట్టుకుపోయి గుంతల మయమైన రహదారులపై ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొన్నప్పటికీ వాటి బాగుకోసం నిధులు మంజూరు చేసే ధ్యాస పాలకులకు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాన్సువాడ నుండి హైదరాబాదుకు వెళ్లాలంటే రోడ్లన్నీ ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు ప్రయాణం సుదూరమవుతుందన్న విషయం ప్రభుత్వానికి పట్టనట్లుగా ఉందని ఆవేదన చెందారు. చెడిపోయిన రోడ్లను  బాగు చేయండి మహా ప్రభో.. అంటూ పాలకులకు, అధికారులకు వినతులు చేసుకున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదని చెప్పారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రహదారులతోపాటు, పాడైన రోడ్లను కూడా వేణు వెంటనే మరమ్మత్తులు చేసేందుకు పాలకులు వ్యవహరించి తగినన్ని నిధులను మంజూరు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసే పరిస్థితి ఉండేది అన్నారు.

ప్రస్తుత పాలకులు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి తమ స్వప్రయోజనాల కోసమే పాకులాడడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా, కనీసం ఉన్న రోడ్ల నైనా బాగు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫ్లడ్ ఫండ్ కింద కావలసిన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చినా ముఖ్యమంత్రి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రోడ్ల మరమ్మత్తుల కోసం పనులను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్ ఇషాక్ సాయిబాబా రమేష్ యాదవ్ నాగనాథ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.