10-09-2025 03:13:01 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నల్లగొండ టౌన్,(విజయ క్రాంతి): మతోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్‌లో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సభ జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి లో ఉన్న పెద్దలు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పై వ్యంగ్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి ఓటమి చెందినప్పటికీ నైతికంగా సుదర్శన్ రెడ్డి విజయం సాధించారని చెప్పారు. ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసిన తట్టుకోని నిలబడడాన్ని సుదర్శన్ రెడ్డి ని సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ అభినందిస్తుందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని భాజపా హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు.
నాటి తెలంగాణ సాయుధ పోరాటమంతా వెట్టిచాకిరి దున్నేవాడికి భూమి కావాలని డిమాండ్తో సాగిందన్నారు. నాటి వీరతెలంగాణ స్పూర్తితో సమస్యలు లేని తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం పరామర్శించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నాటి జాగిర్దారు, భూస్వామ్య వ్యవస్థకు, నైజామ్ నవాబుకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
కార్పోరేటు చేతిలో కీలుబోమ్మలుగా ప్రధానమంత్రి పనిచేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రజలకు కనీస మౌళిక సౌకర్యాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరగడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉందన్నారు. ప్రవేటు కంపెనీలను, కార్పోరేట్ పెద్దలను ప్రోత్సహించడానికే ధరలను పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాశం, చినపాక లక్ష్మీనారాయణ, ఊట్కూర్ నారాయణరెడ్డి, పి నర్సిరెడ్డి, కొండ అనురాధ, నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, వెంకన్న, కుంభం కృష్ణారెడ్డి, సర్దార్ అలీ, కుర్తాల భూపాల్, బొల్లు రవీంద్ర కుమార్, పందిరి శ్యాంసుందర్, శ్రీనివాస్* తదితరులు పాల్గొన్నారు.