calender_icon.png 23 January, 2026 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లీకు వీరుడు.. పీకేదేమిటి?

23-01-2026 01:29:06 AM

విచారణకు బరాబర్ వెళ్తా.. మంత్రుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని అడుగుతా

ఏ తప్పు చేయలేదు.. ఎవడికి భయపడం

లొట్ట పీసు కేసులు.. టీవీ సీరియల్‌లాగా సిట్ విచారణలు

జెడ్పీ ఎన్నికలను తప్పించడానికే నోటీసులు

మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు!

ఉన్న జిల్లాలను రద్దు చేస్తే నా నాయకత్వంలోనే ఉద్యమం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

రాజన్న సిరిసిల్ల, జనవరి 22 (విజయక్రాంతి): ‘మేం ఏ తప్పు చేయలేదు. ఎవ డి అయ్యకు భయపడేది లేదు. దావోస్ నుంచి వచ్చేవరకు తన పదవిని ఊడిపోకుండా కాపాడుకోవడానికే సిట్  నోటీ సులతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘కార్తీకదీపం’ టీవీ సీరియల్‌లా విచారణ సాగ దీస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు.. లొట్టపీసు కేసు అని ఇదివరకే చెప్పాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనేవిధంగా కేసులు నడుస్తున్నాయి. మీడియాకు లీకులిస్తూ ఆనందిస్తున్న ముఖ్యమంత్రి మమ్మల్ని పీకేదేమిటి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం సాయంత్రం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో ఆయన.. సిట్ విచారణకు హాజరుకావాలని జారీచేసిన నోటీసుపై మాట్లాడారు.

బొగ్గు కుంభకోణంపై సీఎం బావమరిదిని పేర్కొంటూ మాజీమంత్రి హరీశ్ రావు ఆధారాలు బయటపెట్టడంతో ముఖ్యమంత్రి తాజాగా సిట్‌ను ప్రయోగిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల ఫోన్లు ఇప్పటికీ ట్యాప్ కావడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని శుక్రవారం తను పోలీసు అధికారులను ప్రశ్నిస్తానని అన్నారు. ప్రభుత్వాలపై కుట్ర జరిగినప్పుడు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిఘా వర్గాలు ఫోన్ ట్యాపింగ్ చేయడం సర్వసాధారణమని, 1952 నెహ్రూ కాలం నుంచి నేటి ప్రధాని మోదీ వరకు ఇది సాగుతున్నదని చెప్పారు.

ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఉండదని, ఇది రొటీ న్ కార్యక్రమం అని కేటీఆర్ అన్నారు. ‘మా ఫోన్లు కూడా టాప్ అవుతున్నట్టు అధికారులు చెపుతారా’ అని ప్రశ్నించారు. తాము ఏ తప్పు చేయలేదని, ఎవడి అయ్యకు భయపడబోమని పేర్కొన్నారు. హరీశ్‌రావును, తనను రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది ఒక లొట్ట పీస్ కేసు అని, ఈ రాజకీయ క్రీడలో బలిపశువు అయ్యేది పోలీసులు, అధికారులేనని చెప్పారు.

ఇప్పటి డీజీపీ శివ ధర్‌రెడ్డి, అప్పటి డీజీపీ మహేం దర్‌రెడ్డిలను ఫోన్ ట్యాపింగ్ గురించి విచా రించాలని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు అయ్యేదాకా తాము ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి వెంటపడుతామన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సిట్ విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, కేటీఆర్ స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే సీబీఐతో విచారణ జరిపిస్తామంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దొంగలను కాపాడుతున్నాడని ఆరోపించారు. సిరిసిల్ల, జగిత్యాలతో సహా పలు జిల్లాలను రద్దు చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, జెడ్పీ ఎన్నికలను తప్పించడానికి సిట్ విచారణ కోసం నోటీసులు జారీ చేస్తున్నదని ఆరోపించారు.

జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యం పెరిగిందని, వ్యాపారాలు మెరుగయ్యాయని, కేసీఆర్ ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తే కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ తగిన బుద్ధి చెపుతుంద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల చేతు లో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. జిల్లాలను రద్దు చేస్తే అన్నివర్గాలను కలుపుకొని ఉద్యమం సాగిస్తామని, దానికి తానే నాయకత్వం వహిస్తానని కేటీఆర్ వెల్లడించారు. కాగా సర్పంచ్ ఎన్నికల్లో లాగే మున్సి పాలిటీలను కూడా బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిలను నియమిస్తామని, ప్రతి వార్డును గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.