బాధ్యుడే విచారణ అధికారి!
సూర్యాపేట జిల్లా నామ రిజర్వ్ ఫారెస్ట్‌లో ‘డెక్కెన్ సిమెంట్స్’ అక్రమ మైనింగ్‌పై అటవీ అధికారులపై సీఈసీకి ఫిర్యాదు
క్షేత్రస్థాయి విచారణకు డీఎఫ్‌వో
పాలకవీడు, మార్చి 9: సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలం సైదులు నామ రిజర్వ్ ఫారెస్ట్‌లో డెక్కెన్ సిమెంట్స్ కంపెనీ అటవీ భూములను నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని పసుపు లేటి సురేష్ బాబు అనే వ్యక్తి గత కొన్నేండ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ)కి ఆయన పిర్యాదు చేయటంతో డెక్కెన్ సిమెంట్స్‌పై విచారణ మొదలైంది. రాష్ట్ర అటవీ, గనుల శాఖ అధికారులు సరైన సమాచారాన్ని ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సీఈసీ.. గత నెల 25న అధికారులను ఢిల్లీకి పిలిపించి విచారించినట్లు తెలిసింది.
క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, ఆ విచారణకు పిర్యాదుదారుడిని సైతం తీసుకెళ్లాలని సీఈసీ చైర్మన్ రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించారు. జిల్లా అటవీ శాఖాధికారి వి సతీష్ కుమార్ సోమవారం ఉదయం 11 గంటలకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. అయితే తాను ఫిర్యాదు చేసింది డిఎఫ్‌ఓపైనే అని, ఆయనే వచ్చి తన కేసుని విచారణ చేసుకోవడం విడ్డూరంగా ఉన్నదని, జిల్లా అటవీ శాఖ అధికారులపై ఫిర్యాదు చేస్తే డీఎఫ్‌ఓ వచ్చి విచారణ చేయడం ఏమిటని, డీఎఫ్‌వో తూతూ మంత్రంగా విచారణ చేసి మమ అనిపిస్తున్నారని, ఫిర్యాదుదారుడు సురేష్‌బాబు అన్నారు.




