14-09-2025 07:13:40 PM
ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అల్లే శ్రీనివాస్ తన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పొందిన 9 గుంటల స్థలంపై అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. తన తమ్ముడి కొడుకు అల్లే హరీష్, మాజీ సర్పంచి కోల నరసయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి సహకారంతో ఆ స్థలాన్ని అక్రమంగా తన పేరుమీద మార్చించుకున్నాడని శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
తేదీ 14-02-2023న పెద్దల సమక్షంలో 9 గుంటల స్థలాన్ని నలుగురు వారసులు సమభాగాలుగా పంచుకున్నారని, అయితే తాను హక్కు కలిగి ఉన్న భూభాగాన్ని ఇతరుల పేర్లకు రిజిస్ట్రేషన్ చేసి, తనను దుర్మార్గంగా పక్కనపెట్టారని ఆయన ఆరోపించారు. ఇంతటితో కాకుండా, అల్లే పద్మ (W/o చంద్రమౌళి) కోల నరసయ్య (S/o కాశారాములు) పేర్లకూ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, తేదీ 14-08-2025 న నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా తన తల్లిదండ్రుల ఇంటి స్థలం కూడా స్వాధీనం చేసుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకొని సంబంధిత అధికారుల ద్వారా విచారణ చేపట్టి న్యాయం చేయాలని అల్లే శ్రీనివాస్ కోరారు.