14-09-2025 08:32:43 PM
మందమర్రి,(విజయక్రాంతి): చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి ఉపాధి కోసం వచ్చి విద్యుత్ షాక్ తో మృతి చెందిన యువకుని ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని యాపల్ ఏరియాలో నివాసం ఉంటూ మేస్త్రి పని చేసుకుంటూ జీవిస్తున్న సుకులాల్ యాదవ్ (31) ఆదివారం ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సుకులాల్ యాదవ్ ఉపాధి నిమిత్తం పట్టణానికి వచ్చి గత నాలుగు సం,,గా మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
రోజు వారి విధులలో బాగంగా భోజనం చేసి విధులకు వెళ్దామని బోజనం చేసేందుకు సిద్ధం కాగా భోజనం వేడిగా ఉండగా చల్లార్చేందుకు కూలర్ స్విచ్ ఆన్ చేయగా ఒక్క సారిగా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై 108కి సమాచారం అందించగా అంబులెన్స్ సిబ్బంది చేరుకుని సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసినప్పటికీ, సుకులాల్ యాదవ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ అదనపు ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్థిక సహాయం అందచేత
సుక్ లాల్ యాదవ్ మృతదేహాన్ని స్వగ్రామమైన ఛత్తీస్ ఘడ్ కు తరలించేందుకు ఆర్థికంగా లేకపోవడంతో హిందూ స్మశాన వాటిక, కేకే ఓసి కమిటీ సభ్యులు, స్థానిక యువకులు కలిసి 70,000 వేల రూపాయలు విరాళాలు సేకరించి వారి కుటుంబ సభ్యులుకు అందజేశారు.