14-09-2025 08:12:43 PM
వలిగొండ,(విజయక్రాంతి): మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుక ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో జామ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక జామా మజీద్ నుంచి రాజీవ్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పట్టణ ముస్లిం సోదరులు పాల్గొని, నారే తక్బీర్ అల్లాహు అక్బర్, నారే రిసాలత్ యా రసూలుల్లా, అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ధార్మిక పండితులు మహమ్మద్ మస్తాన్ అలీ యాఖూబీ , మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారని, ఇస్లాం అనేది శాంతి అని ఆనాడు మహమ్మద్ ప్రవక్త బోధించారని స్పష్టం చేశారు.
మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎండి అఖిల్ పాషా మాట్లాడుతూ ఇస్లాం మతం కాదని శాంతి సందేశం అని, ప్రతి పౌరుడు శాంతి ద్వారా మతాలకతీతంగా కలిసిమెలిసి జీవించాలని మహమ్మద్ ప్రవక్త సూత్రాలను ప్రతి పౌరులు పాటించాలని సన్మార్గంలో నడవాలని, ప్రపంచ మానవులకి మహమ్మద్ ప్రవక్త ఆదర్శం అని అన్నారు. ఈరోజుల్లో మానవీయత విలువలు కనుమరుగు అవుతున్నాయని వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత నేటి తరంపైనే ఉందన్నారు. మానవ విలువలను కాపాడి ప్రపంచశాంతికి తోడ్పాటు అందించే విధంగా అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు.